అనుమతి ఉన్నా లేకున్నా.. ధర్నా ఆగదు: కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక

  • కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్
  • జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీ
  • ఈ నిరసనకు మద్దతు ప్రకటించిన విద్యా సంస్కర్త సోనమ్ వాంగ్‌చుక్
ఆన్‌లైన్‌లో వ్యంగ్య వేదికగా ప్రారంభమైన 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఇప్పుడు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ శనివారం (జూన్ 6) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు ప్రకటించింది. పోలీసుల అనుమతి లభించినా, లభించకపోయినా శాంతియుత పద్ధతిలో తమ నిరసనను కొనసాగిస్తామని పార్టీ ప్రతినిధులు స్పష్టం చేశారు.

నిరుద్యోగ యువతపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఈ ఉద్యమం పురుడుపోసుకుంది. ముఖ్యంగా నీట్-యూజీ 2026 పేపర్ లీకేజీ వంటి వరుస కుంభకోణాల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారడంపై ఈ వేదిక గళమెత్తుతోంది.

ప్రస్తుతం బోస్టన్‌లో ఉన్న పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ డిప్కే, ఈ నిరసన కార్యక్రమానికి నేతృత్వం వహించేందుకు జూన్ 6వ తేదీ ఉదయం 8 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఆయన వచ్చిన తర్వాతే పోలీసుల అనుమతి కోరుతూ దరఖాస్తు చేస్తామని.. ప్రజాస్వామ్య నిరసనలకు అధికార యంత్రాంగం కల్పిస్తున్న అడ్డంకులను నిరసించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, విజేతా దహియా, అశుతోష్ రాంకా వెల్లడించారు.

ఈ ఉద్యమానికి ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఇప్పటికే తన మద్దతు ప్రకటించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణల దిశగా ప్రభుత్వం జూన్ 5వ తేదీలోగా తగిన చర్యలు తీసుకోని పక్షంలో, తాను కూడా ఈ నిరసనలో పాలుపంచుకుంటానని ఆయన హెచ్చరించారు.

Cockroach Janata Party
Abhijit Dipke
Dharmendra Pradhan
Sonam Wangchuk
Jantar Mantar Delhi
NEET UG paper leak

More Telugu News